Google మీ డేటాను సురక్షితంగా ఎలా ఉంచుతుంది

హ్యాకింగ్, ఫిషింగ్ నుండి మాల్‌వేర్ వరకు, సైబర్ నేరగాళ్లు యూజర్ ఖాతాలను హైజాక్ చేయడానికి అనేక రకాల పద్ధతులను ఉపయోగిస్తారు. వారి ప్రయత్నాలను ఫలించకుండా చేయడానికి Googleకు చెందిన స్టెఫాన్ మిక్లిట్జ్ అలాగే తాడెక్ పియాట్రజెక్ కృషి చేస్తారు.

మిస్టర్ పియాట్రజెక్, యూజర్ ఖాతాలను సురక్షితంగా ఉంచడానికి మీరు, మీ టీమ్ బాధ్యత వహిస్తున్నారు. హ్యాకర్‌లు యాక్సెస్‌ను పొందకుండా మీరు ఎలా నిరోధించగలరు?

తాడెక్ పియాట్రజెక్, యూజర్ ఖాతా సెక్యూరిటీకి ప్రధాన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్: అన్నిటికంటే ముందు, ప్రారంభ దాడిని గుర్తించగలగడం అనేది ముఖ్యం. అనుమానాస్పద యాక్టివిటీని గుర్తించడానికి మేము వంద కంటే ఎక్కువ వేరియబుల్స్‌ను ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మీరు జర్మనీలో నివసిస్తున్నారని, చాలా అరుదుగా విదేశాలకు వెళ్తారని అనుకుందాం, అలాగే ఎవరైనా మరొక దేశం నుండి మీ ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించారని అనుకుందాం - అప్పుడు అది అనుమానాస్పద యాక్టివిటీగా పరిగణించబడుతుంది.

స్టెఫన్ మిక్‌లిట్జ్, Google గోప్యతా, సెక్యూరిటీ టీమ్‌కు ఇంజినీరింగ్ డైరెక్టర్: అందుకే మీరు మాకు ఇచ్చిన టెలిఫోన్ నంబర్ లేదా ఖాతాదారుగా మీకు మాత్రమే తెలిసిన ఇతర సమాచారాన్ని నిర్ధారించమని కొన్నిసార్లు మిమ్మల్ని అడుగుతాము.

తాడెక్ పియాట్రజెక్ (ఎడమ వైపు) ప్రకారం, ఫిషింగ్ అనేది అతి పెద్ద ఆన్‌లైన్ సెక్యూరిటీ ప్రమాదాలలో ఒకటి.

ఈ రకమైన దాడులు ఎంత తరచుగా జరుగుతాయి?

పియాట్రజెక్: ప్రతిరోజూ లక్షల సంఖ్యలో సైబర్ దాడులు ప్రారంభించబడతాయి. అతిపెద్ద సమస్య ఏమిటంటే, హ్యాక్ చేసిన వెబ్‌సైట్‌ల నుండి దొంగిలించబడిన యూజర్ పేర్లు, పాస్‌వర్డ్‌లను కలిగి ఉన్న లిస్ట్‌లు ఇంటర్నెట్‌లో లెక్కలేనన్ని ఉన్నాయి. మా యూజర్‌లలో చాలా మందికి వేర్వేరు ఖాతాల కోసం ఒకే పాస్‌వర్డ్ ఉన్నందున, ఈ లిస్ట్‌లు Google ఖాతా లాగిన్ డేటాను కూడా కలిగి ఉంటాయి.

సెక్యూరిటీ విషయంలో ఈ లిస్ట్‌లు అతిపెద్ద ముప్పును కలిగిస్తాయా?

పియాట్రజెక్: అవును, ఖచ్చితంగా. అవి, వాటితో పాటు సాధారణ ఫిషింగ్ దాడులు కూడా. ఖాతా పాస్‌వర్డ్‌లను పొందడానికి ప్రయత్నిస్తున్న నేరస్థుల నుండి దాదాపు ప్రతి ఒక్కరూ ఈమెయిళ్లను అందుకున్నారు. సహజంగా, వారి ప్రయత్నాలు ఫలించకుండా ఉండటానికి మా వంతు కృషి చేస్తాము. మీ Gmail ఇన్‌బాక్స్‌కు అందుతున్న ఏదైనా ఈమెయిల్ అనుమానాస్పదంగా ఉన్నట్లు మేము భావిస్తే, మేము దానిని హెచ్చరికతో మార్క్ చేయవచ్చు, తద్వారా మీరు దానిని క్షుణ్ణంగా పరిశీలించవచ్చు లేదా దానిని మేము ఆటోమేటిక్‌గా ఫిల్టర్ చేయవచ్చు. మాకు తెలిసిన ఏదైనా ఫిషింగ్ వెబ్‌సైట్‌ను మీరు సందర్శించడానికి ప్రయత్నించినప్పుడు, మా Chrome బ్రౌజర్ కూడా అలర్ట్‌లను పంపుతుంది.

మిక్‌లిట్జ్: ప్రధానంగా ఫిషింగ్ అనేది రెండు రకాలుగా జరుగుతుంది. మాస్ ఈమెయిళ్లు, నేరస్థులు వీలైనంత ఎక్కువ లాగిన్ డేటాను సేకరించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. మరొకదాన్ని స్పియర్ ఫిషింగ్ అంటారు, ఇందులో నేరస్థులు ఒక నిర్దిష్ట వ్యక్తికి చెందిన ఖాతాను టార్గెట్ చేస్తారు. ఇవి చాలా నెలల పాటు కొనసాగే అత్యంత అధునాతన చర్యలు కావచ్చు, ఈ సమయంలో నేరస్థులు బాధితుల జీవితాన్ని వివరంగా పరిశీలించి, టార్గెట్ చేసిన ఆన్‌లైన్ దాడులను ప్రారంభిస్తారు.

"మీ Gmail ఇన్‌బాక్స్‌కు అందుతున్న ఏదైనా ఈమెయిల్ అనుమానాస్పదంగా ఉన్నట్లు మేము భావిస్తే, మేము దానిని హెచ్చరికతో మార్క్ చేయవచ్చు."

తాడెక్ పియాట్రజెక్

అటువంటి దాడులు విజయవంతం కాకుండా నిరోధించడానికి Google తన యూజర్‌లకు ఎలా సహాయపడుతోంది?

పియాట్రజెక్: ఒక ఉదాహరణ మా 2-దశల వెరిఫికేషన్ సిస్టమ్. చాలా మంది యూజర్‌లకు వారి ఆన్‌లైన్ బ్యాంక్ ఖాతాల ద్వారా ఈ విధమైన సిస్టమ్ గురించి తెలుసు. ఉదాహరణకు, మీరు డబ్బు బదిలీ చేయాలనుకుంటే మీరు మీ పాస్‌వర్డ్ అలాగే టెక్స్ట్ మెసేజ్ ద్వారా పంపిన కోడ్ రెండింటినీ ఎంటర్ చేయాల్సి రావచ్చు. Google రెండు-దశల ప్రామాణీకరణను 2009లో ప్రవేశపెట్టింది, చాలా వరకు ఇతర ప్రముఖ ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్‌ల కంటే ముందుగా ఈ ఫీచర్‌ను అందించింది. అంతే కాకుండా, తమ మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకున్న Google యూజర్‌లు అనుమానాస్పద లాగిన్ ప్రయత్నాల నుండి ఇదే స్థాయి రక్షణ ద్వారా ఆటోమేటిక్‌గా లబ్ది పొందుతారు.

మిక్‌లిట్జ్: రెండు-దశల ప్రామాణీకరణ అనేది ఒక మంచి పద్ధతి, అయితే టెక్స్ట్ మెసేజ్ కోడ్‌లను కూడా ఇతరులు యాక్సెస్ చేయవచ్చు. ఉదాహరణకు, నేరస్థులు మీ మొబైల్ ప్రొవైడర్‌ను సంప్రదించి, రెండవ SIM కార్డ్‌ను పొందేందుకు ప్రయత్నించవచ్చు. బ్లూటూత్ ట్రాన్స్‌మిటర్ లేదా USB స్టిక్ వంటి భౌతిక సెక్యూరిటీ టోకెన్‌ను ఉపయోగించి చేసే ప్రమాణీకరణ మరింత సురక్షితమైనది.

పియాట్రజెక్: మేము ఈ రిసోర్స్‌ను మా అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్లో భాగంగా ఉపయోగిస్తాము.

అది ఏమిటి?

పియాట్రజెక్: అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌ను 2017లో Google ప్రవేశపెట్టింది. జర్నలిస్టులు, CEOలు, రాజకీయ అసమ్మతివాదులు, రాజకీయ నాయకులు మొదలైన వారు అంటే, హ్యాక్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులను ఉద్దేశించి దీన్ని రూపొందించడం జరిగింది.

మిక్‌లిట్జ్: మా భౌతిక 'సెక్యూరిటీ కీ'తో పాటుగా, యూజర్‌లు 'కీ'ని పోగొట్టుకుంటే తప్పనిసరిగా వారి గుర్తింపును వెరిఫై చేయాల్సిన విధంగా అదనపు దశలను చేర్చడం ద్వారా, థర్డ్-పార్టీ యాప్‌ల నుండి డేటా యాక్సెస్‌ను కూడా మేము పరిమితం చేస్తాము.

స్టెఫన్ మిక్‌లిట్జ్
Sicherheitsschlüssel

Googleలో ఇంజినీరింగ్ డైరెక్టర్ అయిన స్టెఫన్ మిక్‌లిట్జ్ ప్రపంచ వ్యాప్తంగా గోప్యత, అలాగే సెక్యూరిటీకి బాధ్యత వహిస్తారు. ఈయన టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్‌లో కంప్యూటర్ సైన్స్ చదివారు, 2007 చివరి నుండి Google మ్యూనిచ్‌ ఆఫీస్‌లో పని చేస్తున్నారు.

ఏదైనా పెద్ద సైబర్ దాడి గురించి అలాగే దానికి మీరు ఎలా స్పందించారో చెప్పగలరా?

పియాట్రజెక్: ఈ దాడులలో ఒకటి 2017 ప్రారంభంలో జరిగింది. బాధితుల Google ఖాతాలకు యాక్సెస్‌ను పొంది, ఆ యూజర్‌ల కాంటాక్ట్‌లకు నకిలీ ఈమెయిల్స్‌ను పంపడానికి హ్యాకర్‌లు ఒక హానికరమైన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ను క్రియేట్ చేశారు. ఈ ఈమెయిళ్లలో, స్వీకర్తలను ఒక నకిలీ Google డాక్యుమెంట్‌కు యాక్సెస్‌ను మంజూరు చేయమని అడగడం జరిగింది. అలా చేసిన వారు అసంకల్పితంగా ఆ మాల్‌వేర్‌కు యాక్సెస్‌ను మంజూరు చేశారు, అలాగే ఆటోమేటిక్‌గా అవే నకిలీ ఈమెయిల్స్‌ను వారి స్వంత కాంటాక్ట్‌లకు పంపారు. ఆ వైరస్ చాలా వేగంగా వ్యాపించింది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోడానికి తగిన ప్లాన్‌లను మేము రూపొందించాము.

మిక్‌లిట్జ్: ఉదాహరణకు, ఇప్పుడు వివరించిన ఈ ప్రత్యేక సందర్భంలో మేము Gmailలో ఆ ఈమెయిల్స్ పంపిణీని బ్లాక్ చేశాము, అలాగే ఆ ప్రోగ్రామ్‌కు మంజూరు చేసిన యాక్సెస్‌ను రద్దు చేసి, ఖాతాలను సురక్షితం చేశాము. వాస్తవానికి, భవిష్యత్తులో ఇటువంటి దాడులకు పాల్పడటాన్ని మరింత కష్టతరం చేయడానికి మేము క్రమబద్ధమైన రక్షణ ఛత్రాలను కూడా జోడించాము. Google ఖాతాలు నిరంతరం దాడికి గురవుతుంటాయి, అందుకోసం మా ఆటోమేటిక్ సిస్టమ్‌లు అత్యంత ప్రభావవంతమైన రక్షణను అందిస్తాయి. వాస్తవానికి, మా యూజర్‌లను వారి Google ఖాతాల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా చేరుకోగలిగినప్పుడే ఇది సాధ్యపడుతుంది – అంటే, రెండవ ఈమెయిల్ అడ్రస్ లేదా మొబైల్ ఫోన్ నంబర్ అవసరం.

"చెప్పాలంటే, సాధారణంగా కొన్ని ప్రాథమిక నియమాలకు కట్టుబడి ఉంటే సరిపోతుంది."

స్టెఫన్ మిక్‌లిట్జ్

సగటు యూజర్‌కు సెక్యూరిటీ అనేది ఎంత ముఖ్యం?

పియాట్రజెక్: చాలా మంది వ్యక్తులు దీనిని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు, అయితే సెక్యూరిటీకి సంబంధించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రయాసతో కూడిన పనిగా ఉండవచ్చు. ఇందువల్లే, ఉదాహరణకు, పలు ఖాతాల కోసం యూజర్‌లు తరచుగా ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తారు -- ఇది మీరు చేయగల తప్పులలో అతి పెద్దది. యూజర్‌లు చిన్నపాటి ప్రయత్నంతో వారి ఖాతాలను ఎలా కాపాడుకోవచ్చు అనేది వివరించడమే మా పని. అందుకే మేము Google ఖాతాలో సెక్యూరిటీ చెకప్ అనే ఫంక్షన్‌ను అందిస్తున్నాము, ఇది యూజర్‌లు తమ సెట్టింగ్‌లను సులభంగా చెక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.

మిక్‌లిట్జ్: చెప్పాలంటే, సాధారణంగా కొన్ని ప్రాథమిక నియమాలకు కట్టుబడి ఉంటే సరిపోతుంది.

ఆ నియమాలు ఏమిటి?

మిక్‌లిట్జ్: పలు సర్వీసులకు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించవద్దు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేసుకోండి, అనుమానాస్పద సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించవద్దు. టెలిఫోన్ నంబర్ లేదా ప్రత్యామ్నాయ ఈమెయిల్ అడ్రస్‌ను అందించండి, తద్వారా ఇతర మార్గాలలో మిమ్మల్ని సంప్రదించడం సాధ్యపడుతుంది. అనుమతి లేని వ్యక్తులు యాక్సెస్‌ను పొందడం కష్టతరం చేయడానికి మీ ఫోన్‌లో స్క్రీన్ లాక్‌ను ఎనేబుల్ చేయండి. కేవలం ఈ సూచనలను పాటించడమనేది ఒక మంచి ప్రారంభం.

ఫోటోలు: కాన్నీ మర్‌బెక్

సైబర్ సెక్యూరిటీ పురోగతులు

ప్రపంచంలోని అందరికంటే ఎక్కువ మందిని ఆన్‌లైన్‌లో, మేము సురక్షితంగా ఎలా ఉంచుతామో తెలుసుకోండి.

మరింత తెలుసుకోండి