COVID‑19 మోసాలను నివారించడంలో మీకు సహాయం చేస్తున్నాము

మీరు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు మిమ్మల్ని సురక్షితంగా ఉంచాలనుకుంటున్నాము, అందువల్ల మేము రూపొందించే ప్రతి ప్రోడక్ట్‌ను కూడా, అంతర్గతంగా ఉండే ఒక శక్తివంతమైన భద్రతా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సురక్షితం చేసి, హానికరమైన ప్రమాదాలు మిమ్మల్ని చేరుకోవడానికి ముందే వాటిని గుర్తించి, నిరోధిస్తాము.

COVID‑19కు సంబంధించిన ఆన్‌లైన్ మోసాలు ఇటీవల గణనీయంగా పెరిగాయి. ఈ మోసాలను గుర్తించి, వాటిని నిరోధించి మీరు ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండగలిగేలా సహాయపడటానికి మేము ఈ చిట్కాలను అందిస్తున్నాము.

మోసాలలో సాధారణ రకాలు

మీ వ్యక్తిగత డేటా దొంగతనం

మీ బీమా పాలసీని ధృవీకరిస్తామని చెప్పి లేదా కాంటాక్ట్ ట్రేసింగ్ కోసమని చెప్పి మీ చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా పిన్ నంబర్ వంటి మితిమీరిన సమాచారం అడిగే స్కామర్లు.

వస్తువులు, సర్వీసుల అమ్మకాలపై నకిలీ ఆఫర్లు

మాస్కులపై లేదా ఆన్‌లైన్ వినోద సేవల సభ్యత్వాలపై భారీ తగ్గింపు ఇస్తామని ఆశ చూపే అనామక థర్డ్ పార్టీలు.

ప్రభుత్వ అధికారులమని మోసపూరితంగా చెలామణీ అవ్వడం

COVID‑19 గురించిన సమాచారాన్ని అందించే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు చెందినవారిమని మోసపూరితంగా చెలామణీ అవ్వడం

మోసపూరిత చికిత్సా ఆఫర్లు

చికిత్సలు, టెస్ట్ కిట్‌లు, హ్యాండ్ శానిటైజర్లు లేదా ఫేస్ మాస్క్‌లపై ఆఫర్‌లని చెప్పి మోసగించడం

స్వచ్ఛంద సంస్థల విరాళాల కోసమని నకిలీ అభ్యర్థనలు

COVID‑19 ను ఎదుర్కోవడంలో సహాయపడటానికి లాభాపేక్షలేని సంస్థలకు, ఆసుపత్రులకు లేదా ఇతర సంస్థలకు విరాళం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి

COVID‑19 మోసాలను నివారించడానికి చిట్కాలు

స్కామర్లు మిమ్మల్ని ఎలా చేరుకుంటారో తెలుసుకోండి

COVID‑19కు సంబంధించి ఇటీవల పెరిగిన కమ్యూనికేషన్‌ను ఆసరాగా చేసుకుని, స్కామర్లు తమ మోసాలను, వైరస్ గురించి పంపే చట్టబద్ధమైన సందేశాల లాగా చెలామణీ చేస్తున్నారు. స్కామర్లు మిమ్మల్ని చేరుకోవడానికి ఇమెయిల్‌లు, SMSలు, ఆటోమేటెడ్ కాల్స్‌లతో పాటు మోసపూరిత వెబ్‌సైట్‌లను కూడా ఉపయోగించవచ్చు.

విశ్వసనీయ సోర్సులను నేరుగా చెక్ చేసుకోండి

సాధారణంగా, స్కామర్లు ప్రసిద్ధమైన, నమ్మదగిన, అధికారిక సోర్సులుగా కనపడి, మోసం చేస్తారు. COVID‑19 గురించి తాజా సమాచారం పొందడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) వంటి సోర్సులను నేరుగా సందర్శించండి.

ఎవరైనా వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారం అడిగితే జాగ్రత్తగా ఉండండి, కొంచెం సేపు వేచి ఉండి, ఆ సమాచారం ఇచ్చే ముందు ఆలోచించండి.

సమాచారం కోసమని ఎవరైనా మీకు అయాచితంగా అభ్యర్థన పంపితే, కొంత సమయం కేటాయించి ఆ సందేశాన్ని పరిశీలించండి. సాధారణంగా, లాగిన్ సమాచారం, బ్యాంక్ వివరాలు, చిరునామాలు వంటి మితిమీరిన సమాచారాన్ని ఇవ్వమని స్కామర్లు కోరతారు. బ్యాంక్ బదిలీ లేదా వర్చువల్ కరెన్సీ ద్వారా కూడా వాళ్లు చెల్లింపు చేయమని అడగవచ్చు.

లాభాపేక్షలేని సంస్థలకు నేరుగా విరాళం ఇవ్వండి

COVID‑19 సహాయక చర్యల కోసం విరాళాలు కోరుతూ, లేదా లాభాపేక్షలేని సంస్థల లాగా నటిస్తూ కొంతమంది స్కామర్లు మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటారు. మీ డబ్బు, మీరు ఉద్దేశించిన లాభాపేక్షలేని సంస్థకే చేరుతోందని నిర్ధారించుకోవడానికి, సదరు సంస్థ వెబ్‌సైట్ ద్వారా నేరుగా విరాళం ఇవ్వండి, ఎవరైనా ఏదైనా లింక్ పంపితే, దానిని క్లిక్ చేసి పంపకండి.

క్లిక్ చేసే ముందు లింక్‌లను, ఇమెయిల్ చిరునామాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి

సాధారణంగా, నకిలీ లింకులు అనేవి, ఒరిజినల్ వెబ్‌సైట్ లాగానే కనిపించడానికి కేవలం కొన్ని అదనపు పదాలు లేదా అక్షరాలను జోడిస్తాయి.

ఇక్కడ క్లిక్ చేయండి"" అని ఏదైనా లింక్ ఉంటే, ఆ లింక్‌పై మీ మౌస్ కర్సర్‌ను ఉంచి, లేదా ఆ పదాలను ఎక్కువసేపు నొక్కి ఉంచి, ఆ URLలో ఏవైనా తప్పులు ఉన్నాయా లేదా అని చూడండి. ఇలా చేస్తున్నప్పుడు ఆ లింక్‌ను క్లిక్ చేయకండి. URLలు లేదా ఇమెయిల్ చిరునామాలలో స్పెల్లింగ్ తప్పులు, ర్యాండమ్ అక్షరాలు, సంఖ్యలు ఉంటే అవి స్కామ్ అయ్యే అవకాశముంది.

దీనిని ఇదివరకే ఎవరైనా రిపోర్ట్ చేశారా అన్నది తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో వెతకండి

ఎవరైనా మీకు మోసపూరిత మెసేజ్ పంపారంటే, సాధారణంగా వారు వేరే వాళ్లకు కూడా అదే మెసేజ్‌ను పంపి ఉంటారు. మీ మెసేజ్ వచ్చిన ఇమెయిల్ చిరునామా, ఫోన్ నంబర్ లేదా అందులోని అనుమానాస్పద భాగాన్ని కాపీ చేసి ఏదైనా సెర్చ్ ఇంజిన్‌లో పేస్ట్ చేసి వెతకండి. అలా చేయడం వల్ల, దాన్ని ఇదివరకే‌ ఎవరైనా రిపోర్ట్ చేశారా అన్నది తెలుస్తుంది.

మీ ఖాతాకు అదనపు భద్రతను జోడించండి

అదనపు ఆన్‌లైన్ రక్షణ కోసం, మీ ఖాతాకు 2-దశల ప్రామాణీకరణను - 2-దశల వెరిఫికేషన్ అని కూడా అంటారు - జోడించండి. ఖాతాకు యాక్సెస్ పొందడానికి రెండు దశలు అవసరం కాబట్టి ఇది మరొక స్థాయి భద్రతను ఇస్తుంది: ఉదాహరణకు, మీకు తెలిసినదానితో (మీ పాస్‌వర్డ్) పాటు, మీ చేతిలో ఉన్న వస్తువు (మీ ఫోన్ లేదా భద్రతా కీ వంటివి).

దాన్ని రిపోర్ట్ చేయండి

మీకు ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే, దాన్ని g.co/ReportPhishing లేదా g.co/ReportMalware కు రిపోర్ట్ చేయండి

COVID‑19 ఆన్‌లైన్ మోసాలను నివారించడంలో ఇతరులకు సహాయం చేయండి.

ఈ సమాచారాన్ని ఇతరులకు చేరవేయండి, ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండేలా సహాయపడండి. ఈ చిట్కాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఈ సమాచారాన్ని కుదించి రూపొందించిన ఒక-పేజీ-సారాంశాన్ని దిగువున డౌన్‌లోడ్ చేసుకోండి.

PDFను డౌన్‌లోడ్ చేయండి